సైనా నెహ్వాల్, ప్రణయ్‌లకు కరోనా.. థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి ఔట్

1/12/2021
భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలలో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఆ వెంటనే ప్రణయ్‌కి సైతం కరోనా సోకినట్లు నిర్ధారించారు. నేటి (జనవరి 12) సాయంత్రం నుంచి థాయిలాండ్ ఓపెన్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో నిర్వహించిన మూడో టెస్టులో వీరికి కరోనా సోకినట్లు తేలింది.

థాయ్‌లాండ్ ఓపెన్‌ సూపర్‌-1000లో భాగంగా తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన షట్లర్‌ కిసోనా సెల్వడురేతో తెలుగు తేజం సైనా నెహ్వాల్(Saina Nehwal) తలపడాల్సి ఉంది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా నిర్వహకులు జరిపిన పరీక్షలలో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో టోర్నీ నుంచి తప్పుకోవాలని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ సైనా నెహ్వాల్‌, ప్రణయ్‌లకు సూచించినట్లు సమాచారం.

కాగా, దాదాపు ఏడాది అనంతరం బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనేందుకు భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు(PV Sindhu), సైనా నెహ్వాల్ సహాలు పలువురు క్రీడాకారులు సన్నద్ధమయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఇది సన్నాహక టోర్నీగా భావించిన సైనా, ప్రణయ్‌లకు నిరాశే ఎదురైంది. చైనా, జపాన్ ప్లేయర్లు లేకుండా జరుగుతున్న టోర్నీ కావడంతో భారత్‌కు విజయావకాశాలు ఉన్నాయి. కానీ కరోనా సోకడంతో సైనా నెహ్వాల్, ప్రణయ్ టోర్నీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి తలెత్తడం గమనార్హం.

ప్రస్తుతం బ్యాంకాక్ ఆసుపత్రిలో సైనా నెహ్వాల్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌ను సైతం ఆసుపత్రిలో చేరాలని, మరోసారి టెస్టులు చేయించుకోవాలని నిర్వాహకులు సూచించారు. మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రణయ్‌కి తాజాగా చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ రాగా అతడు సైతం టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Other news

More News

-Next--Last