విజయవాడ నగరంలో కరోనా రోగుల మృతదేహాలతో నిండిపోతున్న శ్మశానాలు

4/22/2021
 విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా రోగుల మృతదేహాలతో శ్మశానాలు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో భౌతికకాయాల అంత్యక్రియలకు ఆలస్యం అవుతోంది. కరోనా సోకడంతో అందరూ ఉన్నా అనాధల్లా కరోనా మృతదేహాలు పడి ఉన్న పరిస్థితి నెలకొంది. కరెంటు మిషన్ ద్వారా రోజుకు పది మృతదేహాలు మాత్రమే ఖననం చేస్తున్నారు.  అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి ఏర్పడటంతో ఆత్మీయులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇతర శ్మశాన వాటికల్లో పుల్లలపై దహనం చేసే పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి కూడా మృతదేహాలను తగులపెడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కరోజే విజయవాడ నగరంలో దాదాపుగా 78 మంది చనిపోయారు. కాగా, మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటంతో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది.

మరోవైపు, తెలంగాణలోనూ కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరగుతున్నాయి. రోజురోజుకీ ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తెలంగాణలో వరుసగా రెండో రోజు 5వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,567 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 23 మంది మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3,73,468కి చేరింది. వీరిలో 3,21,788 మంది కోలుకోగా… ఇప్పటి వరకు 1899 మంది ప్రాణాలు కోల్పోయారు.

More news

Related News

-Next--Last