వెంకటాద్రిపై మారుతికి జన్మనిచ్చిన అంజనాదేవి

4/21/2021
Lord Hanuman Birth Place : హనుమంతుడు జన్మించింది.. అంజనాద్రి మీదే అంటూ పక్కా ఆధారాలు టీటీడీ బయపెట్టింది. పురాణాల నుంచి భౌగోళిక పరిస్థితుల వరకు చరిత్రను, ఇతిహాసాన్ని పరిశీలిస్తే… మారుతి మనవాడే అంటోంది. ఇంతకీ తిరుమల తిరుపతి దేవస్థానం బయటపెట్టిన ఆధారాలు ఏంటి.. అందులో ఏముంది ? సంతానం కలగడం లేదని పుట్టెడు దుఖంలో ఉన్న అంజనాదేవి.. ఓ సోదమ్మ చెప్పిన సలహాతో వేంకటగిరి మీద తపస్సు చేయడానికి వస్తుంది.

ఆకాశగంగ తీర్థానికి సమీపంలో కేవలం వాయుభక్షణ చేస్తూ వాయుదేవుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన వాయుదేవుడు.. ఓ అమూల్యమైన ఫలాన్ని అందిస్తాడు. ఆ ఫలాన్ని తిన్న అంజనా దేవి.. గర్భాన్ని ధరిస్తుంది. అక్కడి నుంచి పదవ నెలలో.. శ్రావణ మాసంలో హనుమంతునికి జన్మనిస్తుంది. పుడుతూనే గొప్ప ఆకలితో… సూర్యున్ని పండు అనుకొని తినాలని ఎగురుతాడు. అలా ఎగిరింది కూడా అంజనాద్రి నుంచే అని పురాణాలు చెప్తున్నాయ్. ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ.. హనుమంతుడు పుట్టింది తిరుమల కొండపైనే అని కమిటీ తేల్చింది.

జాపాలీ తీర్థంలో హనుమంతుడి జననం :
అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు కమిటీ వెల్లడించింది. శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో కమిటీ సభ్యులు ఆధారాలు సేకరించారు. వేంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడు. సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు. ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని 12 పురాణాలు చెప్తున్నాయని వివరించారు.

హనుమంతుడికి అంజనాద్రిమీదే అంజనాదేవి జన్మనిచ్చిందని చెప్పడానికి పౌరాణికంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయని కమిటీ తెలిపింది. జపాలీతీర్థం సమీపంలోని ఆకాశగంగ సమీపంలోనే అంజనా దేవీ తపస్సు చేసిందని.. వరాహపురాణం, స్కంద పురాణంలో వర్ణించారని తేల్చింది. వీటితో పాటు చాలా పురాణాల్లో హనుమంతుడు పుట్టింది వేంకటాచలంలోనే అని తెలుస్తోందంటోంది కమిటీ. అంజనాదేవీ తపస్సు ఫలంగానే ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందని చెప్పారు.

వాంగ్మయాల పరంగా పరిశీంచినా.. వెంకటాద్రే అంజనాద్రి అనడానికి ఆధారాలు ఉన్నాయని కమిటీ సభ్యులు తేల్చారు. వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదం అయిన కంబరామాయణంలో వరాహపురాణంలో చెప్పిన విషయాలే ప్రస్తావించారు. సీతను వెతుక్కుంటు వానరులు అంజనాద్రికే వచ్చారు. 12, 13వ శతాబ్దానికి చెందిన హంస దూతంలోనూ వేంకటాద్రియే అంజనాద్రి అని ఉందని తెలిపారు. ఇక తాళ్లపాక అన్నమాచార్యులవారు తన షణ్ముకప్రియ కీర్తనంలోనూ వెంకటాద్రిని అంజనాద్రియే అని పాడారు. శాసనాలు కూడా మారుతి మనవాడే అని చెప్తున్నాయని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. వేంకటాచల మహత్మ్యం అనే గ్రంథం ప్రమాణమే అని చెప్పడానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో లభిస్తున్నాయ్. ఆ శాసనాల మీద ఉన్న శ్లోకాలు కూడా వేంకటాద్రియే అంజనాద్రి అని చెప్తున్నాయని కమిటీ సభ్యులు వివరించారు.

అహోబిలానికి 10 యోజనాల దూరం :
భౌగోళికంగానూ ఆంజనేయుడు పుట్టింది ఏడుకొండల మీదే అనడానికి ఆధారాలు ఉన్నాయని కమిటీ సభ్యులు చెప్తున్నారు. స్కందపురాణంలో చెప్పినట్లు మతంగమహర్షి దగ్గరకు అంజనా దేవీ వెళ్లినప్పుడు.. సువర్ణముఖి నదికి ఉత్తరాన అహోబిలానికి 10 యోజనాల దూరంలో ఉన్న వెంకటాచలానికి వెళ్లాలని సూచించారు. దీని ఆధారంగా అంజనాదేవీ పూజ చేసింది వేంకటాద్రి మీదే అని ఆధారాలతో సహా వివరిస్తున్నారు కమిటీ సభ్యులు. ఇలా ఎలాంటి ఆధారాలు పరిశీలించినా.. అంజనాద్రిపైనే హనుమంతుడు జన్మించాడని నిరూపితం అవుతోందని.. మారుతి జన్మస్థలం వేరే ఎక్కడో అన్న భావనలో ఉన్న ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇదని.. కమిటీ సభ్యులు అంటున్నారు.

More news

Related News

-Next--Last