దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 'పెళ్ళిసందడి'కి పాతికేళ్ళు

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన 'పెళ్ళి సందడి' జనవరి 12తో పాతికేళ్ళు పూర్తి చేసుకుంటోంది. 1996 జనవరి 12న విడుదలైన 'పెళ్ళి సందడి' ఆ నాటి సంక్రాంతి సంబరాల్లో భలేగా సందడి చేసింది. ఈ చిత్రంతోనే హీరో శ్రీకాంత్ కు స్టార్ హోదా లభించింది. ఇక రవళికి నాయికగా మంచి పేరు దక్కింది. ఇందులోని కామెడీని చూసి, తరువాత పెళ్ళిళ్ళు  జరుపుకున్నవారు అదే తీరున చతుర్లు ఆడడమూ జరిగింది. ఈ సినిమా తరువాత వివాహ వాహనాలపై ఫలానా వారి ఇంట 'పెళ్ళిసందడి' అంటూ రాసుకొనేవారు. దీనిని బట్టే 'పెళ్ళి సందడి' చిత్రం ఎంతలా జనాన్ని ఆకట్టుకుందో ఊహించవచ్చు. 

కథ విషయానికి వస్తే, హీరోకు కలలో ఓ అందాలభామ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆమె ఎవరో అతనికి తెలియదు. కేవలం నాభి దగ్గర మచ్చ  ఒక్కటే ఆధారం. ఆమెనే పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అయితే పెద్దలు ఓ అమ్మాయితో పెళ్ళి నిర్ణయిస్తారు. ఆ అమ్మాయి, ఈ అబ్బాయినే భర్తగా ఊహించుకొని కలల్లో తేలిపోతూ ఉంటుంది. చివరకు ఓ పెళ్ళికి వెళ్ళిన హీరోకు అక్కడ తన స్వప్నసుందరి కనిపిస్తుంది. తరువాత అదే అమ్మాయికి అనుకోకుండా హీరో సంగీతం మాస్టారు అవుతాడు. ప్రేమించుకుంటారు. పెద్దలకు చెప్పాలనకుంటారు. చివరకు అతనికి నిశ్చితార్థమైన అమ్మాయికి, స్వప్నసుందరి చెల్లెలు అని తేలుతుంది. అక్క త్యాగం, హీరోతో ఆమెచెల్లెలికి పెళ్ళి. శుభం కార్డు. ఇదీ కథ. దీనిని పాటల పందిరిలా అలంకరించి అలరించారు రాఘవేంద్రరావు. 

చిన్న సినిమాగా వచ్చిన 'పెళ్ళిసందడి' అతి పెద్ద విజయం సాధించి, అంతకు ముందుఉన్న  పలు రికార్డులను బద్దలు చేసింది. ఈ చిత్రం 30 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 27 కేంద్రాలలో డైరెక్టుగా రెగ్యులర్ షోస్ తో రజతోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా నిలచింది. 12 కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శితమయింది. విజయవాడ - స్వర్ణ ప్యాలెస్ లో ఏకధాటిగా 301 రోజులు ఆడింది. ఇక హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలో స్వర్ణోత్సవం చూసింది. లేట్ రన్ లో మరో పది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో 200 రోజులు హౌస్ ఫుల్ సాధించింది. గుంటూరు బాలభాస్కర్ లో 150 రోజులు హౌస్ ఫుల్ చూసింది.  ఇక హైదరాబాద్ సంధ్య థియేటర్ లో కోటి రూపాయలు పోగేసి, సింగిల్ థియేటర్ లో కోటి రూపాయలు చూసిన తొలి తెలుగు చిత్రంగా నిలచింది

Other news