తెలంగాణలో థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి: కేసీఆర్

గత ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. సినిమా రంగానికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు.

అదే సమయంలో థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రాని కల్లా థియేటర్ల రీఓపెనింగ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. అదే సమయంలో థియేటర్లలో టిక్కెట్ల ధరలను ఢిల్లీ, మహారాష్ట్రలలో వున్న విధంగా సవరించుకునే వెసులుబాటును కూడా కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

సినీ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిసి థియేటర్ల రీఓపెన్‌కు జీవో జారీ చేయాలని కోరిన మర్నాడే థియేటర్ల రీఓపెన్‌కు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అదే సమయంలో కుదేలైపోయిన థియేటర్లు మళ్ళీ గాడిలో పడేందుకు వీలుగా టిక్కెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించనున్నది.

Other news