Ind vs Eng: ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం..టీమ్​ఇండియా 466 ఆలౌట్..

9/5/2021
IND Vs  ENG 4th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 466 పరుగులకు ఆలౌటైంది. రెండో సెషన్‌లో పంత్‌ (50), శార్దూల్‌ ఠాకూర్‌ (60) అద్భుత బ్యాటింగ్‌కు తోడు టెయిలెండర్లు ఉమేశ్‌ యాదవ్‌ (25), బుమ్రా (24) రాణించారు. దీంతో భారత్‌ భారీ స్కోర్‌ సాధించడమే కాకుండా ఇంగ్లాండ్‌ ముందు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44), రవీంద్ర జడేజా (17) నాలుగో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం జోడించారు. నిన్న రోహిత్ శర్మ అద్వితీయ సెంచరీ (127) చేయగా, ఛతేశ్వర్ పుజారా (61) అర్ధ శతకం సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీశారు.

శార్దూల్‌ కొత్త చరిత్ర 
నాలుగో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur)కొత్త రికార్డును అందుకున్నాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు అర్థసెంచరీలు సాధించిన నాలుగో టీమిండియా బ్యాట్స్‌మన్‌గా శార్దూల్‌ ఠాకూర్‌(Shardul Thakur) నిలిచాడు. ఇంతకముందు హర్భజన్‌ సింగ్( వర్సెస్‌ న్యూజిలాండ్‌ , అహ్మదాబాద్‌, 2010); భువనేశ్వర్‌ కుమార్‌( వర్సెస్‌ ఇంగ్లండ్‌, నాటింగ్‌హమ్‌, 2014); వృద్ధిమాన్‌ సాహా( వర్సెస్‌ న్యూజిలాండ్‌, కోల్‌కతా, 2016) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

More news

Related News