‘దళిత బంధు పథకం’తో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు సాధ్యమేనా?

8/30/2021
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్, దళిత బంధు చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అన్ని పార్టీల నాయకులు దళితులపై ప్రేమ కురిపిస్తున్నారు.

అయితే అసలు దళితులకు, హుజూరాబాద్ ఎన్నికలకు ఉన్న సంబంధమేంటనే చర్చ మొదలైంది.

ఇంతకుముందు జరిగిన ఉపఎన్నికలలో దళితుల పట్ల చూపని మమకారం ఇప్పుడు ప్రతి పార్టీ కనబర్చడంపై ఆసక్తి నెలకొంది.

దళిత బంధు గురించి గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉన్నప్పటికీ ఆచరణలోకి మాత్రం రాలేదు. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడి వెళ్లిన తరువాత ఇద్దరి మధ్య విభేదాలు పూర్తిగా బయటపడడం, ఆయన బీజేపీలో చేరడంతో హుజూరాబాద్‌పై పట్టు సాధించేందుకు కేసీఆర్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే దళిత బంధును అమల్లోకి తెచ్చారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ రాజకీయ అనుభవం వర్సెస్ ఈటెల రాజేందర్ అస్తిత్వం అన్నట్లుగా కనిపిస్తోంది. ఈటెల రాజేందర్, బీజేపీలకు చెక్ పెట్టే లక్ష్యంతోనే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.

కేసీఆర్ సైతం తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి నుంచి దళిత బంధుని ప్రారంభించినా.. హుజూరాబాద్ నుంచే మొదలవుతుందని ప్రకటించారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 16న హుజూరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించిన సభలో దళిత బంధు వివరాలు వెల్లడించారు.

ప్రభుత్వం ‘దళితబంధు’తో దళితులకు చేరువ కావడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ‘దళిత ఆదివాసీ దండోరా’ పేరుతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

హుజూరాబాద్‌కు దళిత రాజకీయాలకు ఏంటి సంబంధం?
బీజేపీలోకి చేరిన తరువాత ఈటెల రాజేందర్ ఈ ఎన్నికలను తన అస్తిత్వాన్ని నిరూపించే పోరాటంగా భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఈటెల రాజేందర్ 2003లో రాజకీయ ప్రవేశం చేసినప్పటికీ 2009 నుంచి హుజూరాబాద్ రాజకీయాలలో పట్టు సాధించారు .

హుజూరాబాద్ రాజకీయాలను కులం కోణంలో చూస్తే ఈటెల రాజేందర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ కూడా బీసీ వర్గానికి చెందిన వారు.

ఈ పరిస్థితులలో బీసీ ఓట్లు తమకు తగ్గినా ఇతర వర్గాల ఓట్లను గంపగుత్తగా సాధించడంపై కేసీఆర్ దృష్టిపెట్టారని, అందుకే దళిత బంధు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

ఇది మొదటి వ్యూహం కాగా కేసీఆర్ తన రెండో వ్యూహంలో భాగంగా బీసీ వర్గానికే చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టికెట్ ప్రకటించడం. యువత, బీసీ కలయికగా గెల్లు శ్రీనివాస్‌ను వ్యూహాత్మకంగా హుజూరాబాద్ అభ్యర్థిగా నిలిపారు.

అలాగే, పద్మశాలి అయిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు.

అయితే, కేసీఆర్ ఎన్ని వ్యూహాలు రచించినా గెలుపు తమదేనంటోంది బీజేపీ.

More news

Related News