తెలంగాణలో స్థిరాస్తి విలువలు పెరిగాయ్‌! రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 7.5 శాతానికి పెంపు

7/21/2021
రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల మార్కెట్‌ విలువను గరిష్ఠంగా 50, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల విలువను గరిష్ఠంగా 30 శాతం పెంచారు. కొత్తగా నిర్ణయించిన భూముల ధరలు, పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు గురువారం నుంచి జరిగే అన్ని రిజిస్ట్రేషన్లకు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు, రుసుం చెల్లించిన వారు కూడా కొత్త ఛార్జీల మేరకే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు 58, 59, 60లను జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 2013 ఏప్రిల్‌ రెండో తేదీ నుంచి అమలవుతున్నాయి. గత ఏడాది జనవరిలోనే విలువలు, ఛార్జీల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తమిళనాడులో 11 శాతం, కేరళలో 10 శాతం, ఆంధప్రదేశ్‌లో 7.5 శాతం ఉన్నట్లుగా పేర్కొన్న ప్రభుత్వం వివిధ సంప్రదింపులు, పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 7.5 శాతంగా నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. కొత్త ధరలు, ఛార్జీల రూపేణా అదనంగా సుమారు రూ. 3000 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.


సాగుభూమి ధర ఇలా...

వ్యవసాయభూముల కనిష్ఠ ధర ఎకరాకు రూ.75 వేలుగా నిర్ణయించారు. ధరలు బాగా తక్కువ ఉన్నచోట 50 శాతం, మధ్యస్థాయిలో ఉన్నచోట 40 శాతం, ఎక్కువ ఉన్న చోట 30 శాతం మేర ధరలు పెంచారు.

ఖాళీ స్థలం చ.గ. కనీస ధర రూ.200

ఖాళీ స్థలాలకు సంబంధించి గతంలో చదరపు గజం కనీస ధర రూ.100 ఉన్న వాటి విలువను రూ.200కు పెంచారు. ధరలు బాగా తక్కువ ఉన్నచోట 50 శాతం, మధ్య స్థాయిలో ఉన్నచోట 40 శాతం, ఎక్కువ ఉన్న చోట 30 శాతం మేర పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ, ఫార్మా, పర్యాటక రంగాల్లో విస్తృత పెరుగుదల, కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కొత్త జిల్లాలు, ఇతర రంగాల అభివృద్ధి నేపథ్యంలో భూముల విలువ భారీగా పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. భూముల మార్కెట్‌ విలువ సవరణ మార్గదర్శకాల మేరకు సుదీర్ఘ కసరత్తు అనంతరం విలువలను ప్రభుత్వం సవరించింది.

ఫ్లాట్‌  చదరపు అడుగు కనీస ధర రూ.1000

అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ చ.అడుగు కనీస ధర గతంలో రూ.800 ఉండగా, దాన్ని రూ.1000గా నిర్ణయించారు. ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్ల ధరలను 20 శాతం నుంచి గరిష్ఠంగా 30 శాతం వరకూ పెంచారు.

అదనపు రుసుం చెల్లింపునకు ‘ధరణి’లో అవకాశం

ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం రుసుం చెల్లించిన వారు తాజాగా పెరిగిన మేరకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు పెరిగిన ఛార్జీల మేరకు అదనపు రుసుం చెల్లించేందుకు ధరణి పోర్టల్‌లో అవకాశం కల్పించారు. అదనపు మొత్తాన్ని రిజిస్ట్రేషన్‌ రోజే చెల్లించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

సందేహాల నివృత్తికి కాల్‌ సెంటర్‌

భూముల ధరల పెంపు, ఇతర వివరాలు, సందేహాలు, అదనపు సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ నెంబర్‌ 18005994788కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

గతంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 6 శాతం (స్టాంపు డ్యూటీ 4 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ: 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతం)

కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 7.5 శాతం (స్టాంపు డ్యూటీ 5.5 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ: 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతం)

More news

Related News

-Next--Last