టీవీ, రేడియోల్లో మహిళా గళాలపై తాలిబన్ల నిషేధం

8/29/2021
ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌లో తాలిబన్లు కఠినమైన ఆంక్షలను ప్రకటించారు. సంగీతంపైనా, టెలివిజన్, రేడియోల్లో మహిళా గళాలపైనా నిషేధం విధించారు. మహిళల గొంతు టీవీలు, రేడియోల్లో వినిపించకుండా నిషేధించారు. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. 

ఆగస్టు 15న తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి స్థానిక మీడియా సంస్థలు కూడా మహిళా ఉద్యోగులను తొలగించాయి. అయితే మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చునని, ఇస్లామిక్ చట్టం ప్రకారం చదువుకోవచ్చునని తాలిబన్లు చెప్పారు. తాలిబన్ల మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదని స్థానికులు చెప్తున్నారు. మహిళలు తమ రోజువారీ జీవితాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. 

తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఇటీవల మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో సంగీతాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఇస్లాం సంగీతాన్ని నిషేధించిందని తెలిపారు. 1996-2001 మధ్య కాలంలో తాలిబన్ల పరిపాలనలో కూడా ఇదే విధంగా ఆంక్షలు విధించారు. క్యాసెట్ టేపులు, మ్యూజిక్ సిస్టమ్స్‌ను అప్పట్లో తాలిబన్లు ధ్వంసం చేశారు. 

ఇదిలావుండగా, ఆఫ్ఘన్ రేడియో స్టేషన్లు ఇస్లామిక్ సంగీతాన్ని ప్రసారం చేయడం ప్రారంభించాయి. దీనికి కారణం తాలిబన్ల ఆదేశాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 

More news

Related News