క్రిప్టో క‌రెన్సీ గురించి ఈ విష‌యాలు తెలుసా?

12/12/2021
cryptocurrency | క్రిప్టోక‌రెన్సీకి ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఇప్పుడిప్పుడే మ‌న దేశంలోనూ దీనికి ఆద‌ర‌ణ పెరుగుతోంది. బ్లాక్ చైయిన్ వ్య‌వ‌స్థ ఆధారంగా ప‌నిచేసే ఈ డిజిట‌ల్ క‌రెన్సీతో లాభాలు ఉన్న‌ప్ప‌టికీ.. అదేస్థాయిలో ప్ర‌మాదాలు కూడా పొంచిఉన్నాయి. ముఖ్యంగా బిట్‌కాయిన్ ( Bitcoin ) త‌ర‌హా క్రిప్టోక‌రెన్సీపై ప్ర‌భుత్వాల నియంత్ర‌ణ లేదు. దీంతో చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాలు జ‌రిగే ఆస్కారం ఎక్కువ‌గా ఉంది. ఆర్థిక మోసాలకు, టెర్ర‌రిస్టుల‌కు ఇది మార్గం ప‌రిచిన‌ట్టు ఉంటుంద‌ని ఆర్థిక‌వేత్త‌లు హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో భార‌త్‌లో విస్త‌రిస్తున్న క్రిప్టో క‌రెన్సీపై నియంత్ర‌ణ‌లు తీసుకురావాల‌ని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. క్రిప్టో క‌రెన్సీ నియంత్ర‌ణ బిల్లును కూడా తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీంతో ఇప్పుడు క్రిప్టో క‌రెన్సీ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలో అస‌లు క్రిప్టో క‌రెన్సీ ఎలా పుట్టింది? దాన్ని ఎవ‌రు సృష్టించారు? ఇది వాడుక‌లోకి ఎలా వ‌చ్చింది వంటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిప్టో క‌రెన్సీ ( cryptocurrency ) ఎలా పుట్టింది?
ఇప్పుడంటే చాలా ర‌కాల క్రిప్టో క‌రెన్సీలు అందుబాటులోకి వ‌చ్చాయి. కానీ క్రిప్టో క‌రెన్సీ మొద‌లైంది మాత్రం బిట్‌కాయిన్‌ ( Bitcoin )తోనే. 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభంతో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింది. ఆ స‌మ‌యంలో బిట్‌కాయిన్ తెర‌మీద‌కు వ‌చ్చింది. 2008 ఆగ‌స్టులో bitcoin.org పేరుతో ఒక వెబ్‌సైట్ ప్రారంభ‌మైంది. ఈ డొమైన్‌ ప్రారంభ‌మైన దాదాపు రెండు నెల‌ల‌కు స‌టోషి న‌క‌మొటో పేరు మీద‌ బిట్‌కాయిన్ ; ఈ పీర్ టు పీర్ ఎల‌క్ట్రానిక్ క్యాష్ సిస్ట‌మ్ శీర్షిక‌తో 9 పేజీల ఆర్టిక‌ల్ ప‌బ్లిష్ అయింది. ఇందులో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌, ప్ర‌భుత్వాల నియంత్ర‌ణ లేని ప్ర‌త్యామ్నాయ డిజిట‌ల్ క‌రెన్సీ గురించి వివ‌రించారు. ఆ మ‌రుస‌టి ఏడాదిలో అంటే.. 2009 జ‌న‌వ‌రి 3న బ్లాక్ చైయిన్ వ్య‌వ‌స్థ ఆధారంగా ప‌నిచేసే తొలి క్రిప్టో క‌రెన్సీ బిట్‌కాయిన్‌ను న‌కమొటో తీసుకొచ్చారు. బిట్‌కాయిన్ పాపుల‌ర్ అవుతున్న స‌మ‌యంలో న‌క‌మొటో పేరుతో ప్ర‌క‌ట‌న‌లు ఆగిపోయాయి. 2011లో బిట్‌కాయిన్ నెట్‌వ‌ర్క్ నియంత్ర‌ణ‌ను గావిన్ ఆండ‌ర్సన్‌కు న‌క‌మొటో అప్ప‌గించారు. ఆ త‌ర్వాత న‌క‌మొటో పేరు ఎప్పుడు విన‌బ‌డ‌లేదు. అయితే న‌క‌మొటో ఎవ‌రు అని తెలుసుకోవ‌డానికి ఇప్ప‌టికి చాలామందే ప్ర‌య‌త్నించారు. కానీ అత‌ను ఎవ‌రు ఒక వ్య‌క్తా? లేదా వ్య‌క్తుల బృంద‌మా? అనేది ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది. అయితే అదృశ్య‌మ‌య్యే ముందు న‌క‌మొటో 10 ల‌క్ష‌ల బిట్‌కాయిన్స్‌ను మైనింగ్ చేసింద‌ని.. ఇప్పుడు వాటి విలువ బిలియ‌న్ డాల‌ర్లు ఉంటాయ‌ని ప‌లువురు చెప్పుకుంటుంటారు. 2011 వ‌ర‌కు బిట్‌కాయిన్ ఒక్క‌టే ఉండేది. కానీ ఆ త‌ర్వాత లైట్‌కాయిన్‌, ఎరిథ్రియం వంటి చాలా ర‌కాల క్రిప్టోక‌రెన్సీలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌దివేల వ‌ర‌కు క్రిప్టోక‌రెన్సీలు ఉన్న‌ట్లు స‌మాచారం.

బిట్ కాయిన్ వంటి క్రిప్టో క‌రెన్సీల‌ను మైనింగ్ ప్ర‌క్రియ ద్వారా సృష్టిస్తారు. ఇక్క‌డ‌ మైనింగ్ అంటే.. బిట్‌కాయిన్ అల్గారిథ‌మ్ సృష్టించే కంప్యూట‌ర్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించడం. అల్గారిథ‌మ్ ఇచ్చే అనేక ట్రాన్స‌క్ష‌న్ల‌ను స‌రిచూసి ఒక బ్లాక్‌లా అమ‌ర్చాలి. ఇలా ఒక్కో బ్లాక్‌ను పూర్తి చేస్తే.. అందుకు ప్ర‌తిఫ‌లంగా కొన్ని కొత్త‌ బిట్‌కాయిన్లు ల‌భిస్తాయి. వీటిని బ్లాక్ రివార్డ్స్ అని కూడా అంటారు. ఇలా కొత్త బిట్‌కాయిన్స్‌ను సృష్టిస్తారు. 2009 జ‌న‌వ‌రి 3న న‌క‌మొటో తొలి బ్లాక్‌చైయిన్ బ్లాక్‌ను పూర్తి చేసి 50 బిట్‌కాయిన్ల‌ను సృష్టించారు. ఈ బ్లాక్‌ను జెనిసిస్ బ్లాక్ అని పిలుస్తుంటారు.

ఇష్టం వ‌చ్చిన‌ట్టు క్రిప్టో క‌రెన్సీని సృష్టించ‌వ‌చ్చా?
మైనింగ్ చేస్తూ ఎలా కావాలంటే అలా.. ఎంత ప‌డితే అంత బిట్‌కాయిన్ల సృష్టించ‌డానికి వీలులేదు. అల్గారిథ‌మ్ ప్రకారం 2140 సంవ‌త్స‌రం వ‌ర‌కు మాత్ర‌మే మైనింగ్ చేయ‌వ‌చ్చు. అందుకు కూడా కొన్ని కండిష‌న్లు ఉన్నాయి. బిట్‌కాయిన్ మైనింగ్‌లో ల‌భించే రివార్డు ప్ర‌తి నాలుగేండ్ల‌కు ఒక‌సారిగా స‌గానికి త‌గ్గిపోతుంది. 2009లో బిట్‌కాయిన్ ప్రారంభ‌మైన‌ప్పుడు ఒక్కో బ్లాక్ పూర్తి చేస్తే 50 రివార్డులు ల‌భించాయి. ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కు.. అంటే 2013లో ఒక్కో బ్లాక్ పూర్తి చేస్తే 25 బిట్‌కాయిన్లు మాత్ర‌మే వ‌చ్చాయి. 2020లో ఈ బ్లాక్ రివార్డు 6.25 బిట్ కాయిన్ల‌కు త‌గ్గింది. 2024 వ‌ర‌కు ఈ రివార్డు మ‌రో సగం త‌గ్గ‌నుంది. ఇలా ఇలా 2140 సంవ‌త్స‌రం నాటికి మొత్తం పూర్త‌య్యేప్ప‌టికి 64సార్లు ఈ రివార్డు విలువ త‌గ్గుతుంది.

వీటిని మొద‌ట ఎలా ఉప‌యోగించారు?
బిట్‌కాయిన్ల‌ను మామూలు క‌రెన్సీలా ఉప‌యోగించ‌లేం. ఎవ‌రైనా బ్లాక్ చైయిన్ విధానం ద్వారా క్రిప్టో క‌రెన్సీని పేమెంట్ల‌కు అంగీక‌రిస్తేనే వీటిని ఉప‌యోగించ‌గ‌లం. ఇప్పుడు అంటే చాలా కంపెనీలు క్రిప్టో క‌రెన్సీని న‌గ‌దు చెల్లింపులు, స్టాక్ ఎక్సేంజి వంటి వాటికి ప‌లు కంపెనీలు అంగీక‌రిస్తున్నాయి. కానీ తొలినాళ్ల‌లో అలా లేదు. 2009లో న‌క‌మొటో 50 బిట్‌కాయిన్ల‌ను సృష్టించిన‌ప్పుడు వాటిని ఖ‌ర్చు చేసే వీలులేదు. దీంతో జ‌న‌వరి 12న కంప్యూట‌ర్ సైంటిస్ట్ అయిన హాల్ ఫిన్నేకు న‌క‌మొటో పంపించారు. ఈ విష‌యం గురించి ఫిన్నే ట్వీట్ చేయ‌డంతో ఇది అంద‌రికీ తెలిసింది. 2010లో బిట్‌కాయిన్ ట్రేడింగ్ మొద‌లైంది. అప్పుడు దాని విలువ భారత క‌రెన్సీ ప్ర‌కారం అర‌పైసా మాత్ర‌మే. ఆ త‌ర్వాత బిట్‌కాయిన్‌పై అంద‌రికీ ఆసక్తి పెరిగింది. దీంతో 2011 ఏప్రిల్‌లో ఒక డాల‌ర్‌గా ఉన్న బిట్‌కాయిన్ విలువ‌..జూన్ నాటికి 32 డాల‌ర్ల‌కు పెరిగింది. 2012 ఆగ‌స్టు నాటికి 13.20 డాల‌ర్ల‌కు పెరిగింది. అయితే 2013లో బిట్ కాయిన్ ధ‌ర అమాంతం పెరిగిపోయింది. ఏప్రిల్ మొద‌ట్లో 220 డాల‌ర్లుగా ఉన్న ధ‌ర‌.. డిసెంబ‌ర్ వ‌ర‌కు 1156 డాల‌ర్ల‌కు పెరిగింది. ఆ త‌ర్వాత మూడు రోజుల్లోనే 760 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. అయితే 2017 డిసెంబ‌ర్‌లో మాత్రం బిట్‌కాయిన్ విలువ 20వేల డాల‌ర్ల‌కు దాటిపోయింది. దీంతో ప్ర‌భుత్వాలు, ఆర్థిక‌వేత్త‌ల‌ దృష్టి దీనిపైనే ప‌డింది. ఆ త‌ర్వాత బిట్‌కాయిన్ విలువ ప‌డుతూ లేస్తూ 2019 నాటికి 7 వేల డాల‌ర్ల‌కు చేరింది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక‌వ్య‌వ‌స్థ స్తంభించ‌డంతో బిట్‌కాయిన్ మ‌ళ్లీ ఊపందుకుంది. ఫ‌లితంగా 2020 డిసెంబ‌ర్‌లో 24వేల డాల‌ర్ల‌కు చేరింది. 2021 జ‌న‌వ‌రిలో 40వేల డాల‌ర్ల‌కు ఎగ‌బాకింది. ఏప్రిల్‌లో 64వేల డాల‌ర్ల‌కు చేరింది. ఆ త‌ర్వాత కొంత త‌గ్గిన న‌వంబ‌ర్ నాటికి మ‌ళ్లీ య‌థాస్థితికి వ‌చ్చింది.

తొలిసారి బిట్‌కాయిన్‌తో రెండు పిజ్జాల కొనుగోలు
2009లోనే బిట్‌కాయిన్స్‌ను ఒక‌రి నుంచి మ‌రొక‌రు పంపుకోవడం మొద‌లైంది. కానీ క్రిప్టో క‌రెన్సీని ఉప‌యోగించి వ‌స్తువుల కొనుగోలు మొద‌లైంది మాత్రం 2010 మే 22న‌. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన హాన్యే అనే ప్రోగ్రామ‌ర్‌.. ప‌ది వేల బిట్‌కాయిన్లు చెల్లించి రెండు పిజ్జాలు కొన్నాడు. అప్పుడు వాటి విలువ సుమారు 47 డాల‌ర్లు మాత్ర‌మే. కానీ ఇప్పుడు ఒక్క బిట్‌కాయిన్ విలువ 68వేల డాల‌ర్ల‌కు పైమాటే. ఏదేమైనా.. బిట్‌కాయిన్ తొలి వాణిజ్య లావాదేవీకి గుర్తుగా ప్ర‌తి ఏటా మే 22వ తేదీని బిట్‌కాయిన్ పిజ్జాడేగా జ‌రుపుకుంటున్నారు.

భార‌త్‌లో ఉన్న టాప్‌-10 క్రిప్టో క‌రెన్సీలు
బిట్‌కాయిన్‌
ఎథెరియం ( ETH)
లైట్‌కాయిన్ (LTC)
కార్డ‌నో (ADA)
పోల్కాడాట్‌
డాగేకాయిన్‌
రిపుల్‌
యూఎస్‌డీ కాయిన్‌
షిబా ఇనూ
యునీస్వాప్‌

క్రిప్టో కరెన్సీతో లాభ‌మా? న‌ష్ట‌మా?
సంప్ర‌దాయ క‌రెన్సీ (ఫియ‌ట్ క‌రెన్సీ) కంటే క్రిప్టో క‌రెన్సీ మంచిద‌ని బిల్‌గేట్స్‌, రిచ‌ర్డ్ బ్రాన్స‌న్ వంటి వ్యాపార‌వేత్త‌లు మ‌ద్ద‌తిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ హోండిపో, స్టార్‌బ‌క్స్ వంటి కంపెనీలు, కొన్ని దేశాల్లోని బ్యాంకులు కూడా క్రిప్టో క‌రెన్సీని ట్రాన్స‌క్ష‌న్స్‌కు అంగీక‌రిస్తున్నాయి. కానీ వారెన్ బ‌ఫెట్‌, పాల్ క్రుగ్‌మ‌న్‌, రిచ‌ర్డ్ షిల్లర్ వంటి ఆర్థిక‌వేత్త‌లు మాత్రం వీటిని వ్య‌తిరేకిస్తున్నారు. దీనివ‌ల్ల ఆర్థిక మోసాలు పెరుగుతాయ‌ని, సైబ‌ర్ సెక్యూరిటీకి భంగం వాటిల్లుతుంద‌ని హెచ్చరిస్తున్నారు. క్రిప్టో క‌రెన్సీ యూజ‌ర్ల వివ‌రాల గోప్య‌త‌, నియంత్ర‌ణ లేక‌పోవ‌డంతో టెర్రరిస్టులు, నేర‌స్థులకు ఇది అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.


భార‌త్‌లో క్రిప్టో క‌రెన్సీ నిషేధ‌మా?
ఎల్ సాల్వ‌డార్ అనే దేశం తొలిసారిగా బిట్‌కాయిన్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించింది. అయితే భార‌త్‌లో మాత్రం క్రిప్టో క‌రెన్సీ వినియోగంపై సందిగ్ధం కొన‌సాగుతోంది. క్రిప్టో క‌రెన్సీపై అప్ప‌ట్లో కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే క్రిప్టో క‌రెన్సీకి నిర్దిష్ట విలువ ఉండ‌ద‌ని.. వీటిపై ప్ర‌భుత్వాల అజమాయిషీ కూడా ఏది ఉండ‌ద‌న్న కార‌ణంతో ఈ డిజిట‌ల్ క‌రెన్సీని నిషేధించాల‌ని ఆ క‌మిటీ సూచించింది. ఈ సూచ‌న‌ల మేర‌కు ఆర్బీఐ 2018లో క్రిప్టో క‌రెన్సీని పూర్తిగా నిషేధించింది. అయితే 2020 మార్చిలో ఈ నిషేధాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ప‌రిమిత స్థాయిలో లావాదేవీలు న‌డుస్తున్నాయి. అయితే క్రిప్టో క‌రెన్సీ నియంత్ర‌ణ‌కు బిల్లు తీసుకురావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే బిట్ కాయిన్‌ను క‌రెన్సీగా గుర్తించే ప్ర‌పోజ‌ల్స్ ఏవీ కేంద్రం ద‌గ్గ‌ర లేద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇటీవ‌ల స్ప‌ష్టం చేశారు.

More news

Related News