ఆఫ్గనిస్తాన్‌లో యథేచ్చగా ఓపియం (Opium) సాగు!

11/9/2021
Opium cultivation in Afghanistan : ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అక్కడి రైతులు యథేచ్చగా ఓపియం పోపీ (Opium poppy) పంటను సాగు చేస్తున్నారు. మూడు నెలల క్రితం ఆఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తొలినాళ్లలో ఓపియం సాగును నిషేధిస్తామని తాలిబన్ (Taliban) పాలకులు ప్రకటించారు.కానీ ఇప్పటికీ ఓపియం సాగును నిషేధించలేకపోయారు. వివిధ మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగించే ఓపియం సాగు అక్కడి రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.తాలిబన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చితికిపోవడం,ఆహార సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో... అనివార్య పరిస్థితుల్లో తాము ఓపియం సాగును కొనసాగించక తప్పట్లేదని అక్కడి రైతులు వాపోతున్నారు.

ఆఫ్గనిస్తాన్‌కు ( Afghanistan) చెందిన రైతు అబా వలీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ తమ పరిస్థితి గురించి వివరించారు. 'మేము మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఓపియం సాగుచేస్తున్నాం. ఓపియం సాగుతోనే మాకు తిండి దొరుకుతోంది. మాకు ఏ ప్రభుత్వం సాయం చేయలేదు. వేరే పంటలు పండించేందుకు అవసరమైన నీటి సదుపాయం ఇక్కడ లేదు.కాబట్టి ఓపియం సాగు మాత్రమే మా ముందున్న ఏకైక ఆప్షన్.' అని వలీ పేర్కొన్నారు.

నిజానికి కొన్నాళ్ల క్రితం వరకూ తాలిబన్లకు డ్రగ్స్ సప్లై (Illegal drugs trade) పెద్ద ఆదాయ వనరుగా ఉంది. ఓపియం పోపీ సాగుతో విదేశాలకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై చేయడం ద్వారా తాలిబన్లకు భారీ ఆదాయం సమకూరేది. ఆ ఆదాయంతోనే తమ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఎట్టకేలకు ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ (Islamic Emirates of Afghanistan) ప్రభుత్వాన్ని స్థాపించారు.ఆఫ్గనిస్తాన్‌లో తమ ప్రభుత్వాన్ని స్థాపించిన వెంటనే డ్రగ్స్‌పై నిషేధం విధిస్తామని ప్రకటించారు.అయితే ఇప్పటివరకూ అది సాధ్యపడలేదు.

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించేందుకు ఏ దేశం సిద్ధంగా లేదు.దీంతో ఆ దేశానికి విదేశీ సహకారం కరువైంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్,వరల్డ్ బ్యాంక్ ఇప్పటికే ఆఫ్గనిస్తాన్‌కు (Afghanistan) నిధులను నిలిపివేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓపియం సాగు ఆఫ్గనిస్తాన్‌ను మరింత కష్టాల్లోకి నెడుతోంది. ఈ అక్రమ ట్రేడింగ్‌ను ఆపకపోతే విదేశీ సంబంధాలు మరింత జటిలమవుతాయి. విదేశీ నిధులు అందాలంటే తాలిబన్లు దీనికి చెక్ పెట్టాల్సి ఉంది. మరోవైపు రైతులు మాత్రం తమకు ఓపియం (Opium poppy) సాగు తప్ప మరో గత్యంతరం లేదని... ప్రభుత్వం తమను ఆదుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇప్పటికే ఆర్థిక,ఆహార సంక్షోభంతో (Afghanistan crisis) రోజురోజుకు దిగజారుతున్న ఆఫ్గన్ పరిస్థితి మున్ముందు మరింత దయనీయంగా మారే ప్రమాదం లేకపోలేదు.

More news

Related News