అఫ్గానిస్తాన్‌: 'మరణ దండన, కాళ్లూ చేతులు నరికే శిక్షలు మళ్లీ అమలు చేస్తాం' - తాలిబాన్లు

10/5/2021
అఫ్గానిస్తాన్‌లో మరణ దండన, కాళ్లూ, చేతులూ నరికే శిక్షలు విధించే నిబంధనలు మళ్లీ చేర్చామని గతంలో తాలిబాన్ల పాలనలో మతాచారాలు పాటించేలా చూసే శాఖకు మంత్రిగా పనిచేసిన ముల్లా నూరుద్దీన్ తురాబీ చెప్పారు.రెండు దశాబ్దాల క్రితం తాలిబాన్ల పాలనలో నేరాలకు కఠిన శిక్షలు విధించిన ముల్లా నూరుద్దీన్ ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో జైళ్ల బాధ్యతను చూసుకుంటున్నారు. "అవసరమైతే కాళ్లూచేతులూ లేదా శరీర అవయవాలను తొలగించే శిక్షలను మళ్లీ అమలు చేస్తాం" అని వార్తా సంస్థ ఏపీతో ఆయన చెప్పారు.

1990వ దశకంలో తాలిబాన్ల పాలనలో నేరస్థులకు ఇలాంటి శిక్షలను బహిరంగంగా అమలు చేశామని, కానీ కొత్త ప్రభుత్వంలో అలా చేయమని ఆయన చెప్పారు.తాలిబాన్ల పాలనలో విధించే కఠిన శిక్షల గురించి విమర్శలు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "మా చట్టాలు ఎలా ఉండాలో, మాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు" అన్నారు.

ఇదే ఏడాది ఆగస్టు 15న తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నతర్వాత.. ఈసారీ తమ ప్రభుత్వంలో సామాన్యులకు ఎన్నో మినహాయింపులు ఉంటాయని, కఠిన చట్టాలు అమలు చేయమని చెబుతూ వచ్చారు. కానీ, దేశంలో చాలా ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ప్రజల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

"హేరాత్‌లో తాలిబాన్లు హై-ప్రొఫైల్ మహిళల కోసం వెతుకుతున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లడంపై నిషేధం విధించారు. వారి దుస్తులపై కూడా ఆంక్షలు విధించారు" అని హ్యూమన్ రైట్స్ వాచ్ గురువారం హెచ్చరించింది.

మైనారిటీ హజారా సమాజానికి చెందిన 9 మంది హత్య వెనుక తాలిబాన్ పైటర్ల హస్తం ఉందని మానవ హక్కుల కోసం పనిచేసే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆగస్టులో చెప్పింది. "ఈ దారుణ హత్యలు తాలిబాన్ల పాత పాలనను గుర్తుకు తెస్తున్నాయి. తాలిబన్ల పాలన ఎలాంటి వినాశనం తెస్తుందనడానికి ఇది సంకేతం" ఆమ్నెస్టీ జనరల్ సెక్రటరీ ఆగ్నెస్ కాలమార్డ్ అన్నారు.

90వ దశకంలో ఎలాంటి శిక్షలు విధించేవారు:
అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు పూర్తిగా స్వాధీనం చేసుకోడానికి కొన్ని రోజుల ముందు తాలిబాన్ జడ్జ్ హాజీ బదరుద్దీన్ బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీతో బాల్ఖ్ ప్రాంతంలో మాట్లాడారు.నేరాలకు కఠిన శిక్షలు విధించే తాలిబాన్ల విధానాన్ని, ఇస్లామిక్ చట్టాలపై వారికి ఉన్న అవగాహనను తాను సమర్థిస్తున్నట్లు చెప్పారు.

"మా షరియా చట్టంలో పెళ్లికి ముందు సెక్స్ నేరం. దానికి పురుషులకు, మహిళలకు ఇద్దరికీ బహిరంగంగా కొరడా దెబ్బల శిక్ష విధించాలి. పెళ్లయిన వారు అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపాలని, దొంగతనం చేసిన వారి చేతులు నరికేయాలనే నిబంధనలు ఉన్నాయి" అని చెప్పారు.తాలిబాన్ల మత ఛాందసవాద ధోరణి, సంప్రదాయ సంకుచిత మనస్తత్వం ఉన్న కొందరు అఫ్గాన్ ప్రజలకు అనుగుణంగా ఉంటుంది.

అయితే, మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంతో మెరుగైన సంబంధాలు ఏర్పరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.తమ ఇమేజ్ ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉందని చూపించుకుంటున్నారు. అదే సమయంలో సంప్రదాయ మనస్తత్వం ఉన్న అప్గాన్లకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

1990వ దశకంలో సంగీతం వినడం లేదా గడ్డం తీసేయడం చేసినవారికి కఠిన శిక్షలు విధించడంతో ముల్లా నూరుద్దీన్ గురించి ప్రపంచానికి తెలిసింది.తాలిబాన్లు కఠిన శిక్షలు విధించే నిబంధనలు కొనసాగుతాయని ఆయన ఇప్పుడు చెబుతున్నారు.

అయితే ప్రజలు టీవీ చూడ్డం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం, ఫొటోలు, వీడియోలు తీసుకోవడం లాంటి వాటిని అనుమతిస్తామని చెప్పారు.తాలిబాన్ల గత ప్రభుత్వంలో తన కఠిన శిక్షలు అమలు చేయడంతో ముల్లా నూరుద్దీన్ ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించిన వారి జాబితాలో చేరారు.ఇలాంటి శిక్షలను బహిరంగంగా అమలు చేయాలా, వద్దా అనేదానిపై తాలిబాన్ ప్రభుత్వం ప్రస్తుతం చర్చలు జరుపుతోందని నూరుద్దీన్ చెప్పారు.

1990వ దశకంలో అఫ్గానిస్తాన్‌లో నేరాలకు పాల్పడినవారికి బహిరంగంగా మసీదుల దగ్గర మైదానంలో లేదా కాబూల్ స్పోర్ట్స్ స్టేడియంలో శిక్షలు విధించేవారు.ఆ సమయంలో ముల్లా నూరుద్దీన్ మతాచారాలు పాటించేలా చూడడం, పాపపుణ్యాల గురించి ప్రచారం చేసే మంత్రిత్వ శాఖకు చీఫ్‌గా ఉండేవారు. ఆయన న్యాయశాఖా మంత్రిగా కూడా పనిచేసారు.

"స్టేడియంలో శిక్షలు విధించే మా నిబంధనను అందరూ విమర్శించారు. కానీ, మేం ఎప్పుడూ వేరే ఎవరి నియమాలు, చట్టాల గురించి ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు" అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

More news

Related News